శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో రూ.1.88 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులకు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ప్రజయ్ షెల్టర్, జనప్రియ వెస్ట్ సిటీ, నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీల్లో చేపట్టనున్న పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్నారు. కాలనీల్లో రోడ్ల నిర్మాణంతో స్థానికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతోపాటు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, ఎక్కడా రాజీ పడకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ప్రజయ్ షెల్టర్ నుంచి మక్తా మహబూబ్ పెద్దకుడి చెరువు కల్వర్టు వరకు రూ.68 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం, జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలో రూ.54 లక్షలతో సీసీ రోడ్డు, కమ్యూనిటీ హాల్ ఫ్లోరింగ్ పనులు, బొల్లారం మెయిన్ రోడ్డు నుంచి నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీ వరకు రూ.66 లక్షలతో కనెక్టివిటీ బీటీ రోడ్డు నిర్మాణం, మొత్తం రూ.1.88 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు పూర్తయితే మియాపూర్ డివిజన్‌లో మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొన్నారు.





