శేరిలింగంపల్లి, జూన్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం, సీఎంసీ ఆధ్వర్యంలో నగరాన్ని పరిశుభ్రంగా, చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎంటీ హిల్స్ కాలనీలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి, ఏఈ, డీఈ, శానిటేషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు. వారితో కలిసి హైదర్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ నగర పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎంసీ నగరాన్ని చెత్త రహితంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజల సహకారం కీలకమని తెలిపారు.

కాలనీవాసులు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది సూచించిన విధంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి అందించాలని కోరారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయన అన్నారు. కాలనీలో ఉన్న పారిశుధ్య సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని నార్నె శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.





