శేరిలింగంపల్లి, జూన్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవుల ఐక్యత, స్వాభిమానం, సాధికారత లక్ష్యంగా ఈ నెల 14న నిర్వహించనున్న యాదవుల దిశ–దశ సమావేశాన్ని విజయవంతం చేయాలని యాదవ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరికి భేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవ సమాజ అభ్యున్నతి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి యాదవ యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, పశుపోషకులు, మేధావులు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, వైద్యులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు సహా అన్ని రంగాల్లో పనిచేస్తున్న యాదవులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమావేశంలో యాదవ సమాజానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించడం, విద్యారంగంలో ప్రత్యేక అవకాశాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాల విస్తరణ, పాల, పశుసంవర్ధక రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, యాదవ యువతకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాల అమలు, యాదవ సమాజ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ వంటి ప్రధాన డిమాండ్లను సమావేశంలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.

ఒక యాదవుడు వస్తే ఒక వ్యక్తి.. అందరూ యాదవులు వస్తే ఒక శక్తి అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సమావేశం యాదవ సమాజ భవిష్యత్ దిశను నిర్దేశించే వేదికగా నిలుస్తుందని అన్నారు. యాదవుల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని, సమాజ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జూన్ 14, 2026 (ఆదివారం) ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌లోని అబిడ్స్ సూర్యలోక్ కాంప్లెక్స్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. యాదవ సమాజానికి చెందిన ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భేరి రామచందర్ యాదవ్ కోరారు.





