శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శేరిలింగంపల్లి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. హఫీజ్‌పేట్‌లోని బీఎల్వై హోమ్స్ వద్ద జరిగిన ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి రవికుమార్ యాదవ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో గత 12 సంవత్సరాలు విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో దేశం ముందుకు సాగిందన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం 4,399 రోజులు, 1,05,576 గంటల పాటు నిరంతర కృషి జరిగిందని పేర్కొన్నారు.

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని రవికుమార్ యాదవ్ తెలిపారు. 2014 నుంచి తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల కంటే అధికంగా గ్రాంట్లు, నిధులు రాష్ట్రానికి అందాయని చెప్పారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వడ్డీ లేని మూలధన పెట్టుబడుల రూపంలో రూ.9,502 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు, రైల్వే బడ్జెట్‌ను రూ.258 కోట్ల నుంచి రూ.5,336 కోట్లకు పెంచడం, 40 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి, 1,719 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, రూ.38,927 కోట్ల వ్యయంతో రహదారి ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం ద్వారా 11 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో రూ.4.3 లక్షల కోట్లకు పైగా నేరుగా జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగాయని తెలిపారు. కోవిడ్ సమయంలో 99 దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేయడం, జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించడం, రూ.70 లక్షల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం మోదీ ప్రభుత్వ ప్రధాన విజయాలని అన్నారు.

దేశ భద్రత విషయంలో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా రాజీపడని వైఖరిని కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిందని చెప్పారు. స్వచ్ఛ భారత్, ఫిట్ ఇండియా, వోకల్ ఫర్ లోకల్, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధికి కొత్త దిశ చూపాయని పేర్కొన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణ, చీనాబ్ బ్రిడ్జ్, అటల్ టన్నెల్, పంబన్ బ్రిడ్జ్ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు, వందే భారత్ రైళ్లు, విమానాశ్రయాల పెరుగుదల, స్టార్టప్ ఇండియా ద్వారా లక్షలాది యువతకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. యూపీఐ ఆధారిత డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయని, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచ వేదికపై గౌరవాన్ని పెంచుకుందని, రైతులు, పేదలు, మహిళలు, యువత జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయని రవికుమార్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణలో కూడా ఇదే అభివృద్ధి వేగం కొనసాగాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ ముందువరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ స్థాయి నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.





