రైతు సంఘాల మండల అధ్యక్షుడిగా బి. రాఘవేందర్ యాదవ్ ఎన్నిక

శేరిలింగంప‌ల్లి, జూన్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పూడూరు మండల రైతు సమైక్య సంఘాల అధ్యక్షుడిగా బి. రాఘవేందర్ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేరవెల్లి గ్రామంలో రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై రైతుల సమస్యలపై విస్తృతంగా మాట్లాడారు. కేరవెల్లి గ్రామ సర్పంచ్ కాటం రామచంద్రయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ బేరి రామచంద్ర యాదవ్ ప్రభుత్వంపై పలు డిమాండ్లు చేశారు. రైతులు పంట సాగు నుంచి మార్కెటింగ్ వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా దళారులు, మధ్యవర్తుల ఆగడాల వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని, పంట పండించిన తర్వాత కూడా విక్రయించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు మధ్యవర్తుల వ్యవస్థను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాల వల్ల గిడ్డంగుల కొరతతో ధాన్యం తడిసి నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే సబ్సిడీపై ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, బ్యాంకు రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వివరించగా, భవిష్యత్తులో వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

సమావేశంలో కేరవెల్లి గ్రామ సర్పంచ్ కాటం రామచంద్రయ్యను మండల కోఆర్డినేటర్‌గా ఎన్నుకోగా, బి. రాఘవేందర్ యాదవ్‌ను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. రైతుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్, కాటం రామచంద్రయ్య, ఎం. నర్సింహులు, వీరేష్, గట్టుపల్లి రామచంద్రయ్య, వి. నరసింహ, కె. శ్రీశైలం, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here