శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లో అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసినందుకు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రెడ్డి ఆరోపించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అనుచరులు, బినామీలుగా పేర్కొన్న పలువురు వ్యక్తులు కొంతమంది రౌడీలతో కలిసి తనపై దాడి చేశారని ఆయన తెలిపారు. సంతోష్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని సర్వే నంబర్ 44లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులకు, అనంతరం హైకోర్టు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో తనపై పగ పెంచుకున్నారని అన్నారు. ఈ క్రమంలో ప్రతాప్ రెడ్డి, జ్ఞానశేఖర్, రమణ, చంద్రశేఖర్, కరీముల్లా, ప్రశాంత్ రెడ్డి, ఉదయ్ రెడ్డి, విట్టల్ రెడ్డి, శరత్ చంద్ర రెడ్డి తదితరులు కొంతమంది వ్యక్తులతో కలిసి తన షాపుపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.

పెద్ద సంఖ్యలో వచ్చిన దుండగులు తన హోటల్‌లోకి బలవంతంగా ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారని, తనపై తీవ్రంగా దాడి చేయడంతోపాటు షాపులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని చెప్పారు. అలాగే తన మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లడంతోపాటు కౌంటర్‌లో ఉన్న రూ.30 వేల నగదు తీసుకెళ్లారని ఆరోపించారు. హోటల్‌లోని సామగ్రిని కూడా ధ్వంసం చేయడంతో భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఈ తరహా దాడులు జరగడం దురదృష్టకరమని సంతోష్ రెడ్డి అన్నారు. ఘటనపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడికి పాల్పడిన వారందరినీ గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సంతోష్ రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే వారిపై భయభ్రాంతులకు గురిచేసే విధంగా దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు.





