శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో రూ.38 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) నిర్మాణ పనులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ జలమండలి, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో కొనసాగుతున్న UGD నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. హనుమాన్ నగర్‌లో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనుల అమలులో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్మాణ సమయంలో కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే UGD పనులు పూర్తయిన వెంటనే రోడ్డు అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆరెకపూడి గాంధీ హామీ ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జలమండలి డీజీఎం నరేందర్, సీఎంసీ ఇంజినీరింగ్ విభాగం డీఈ దుర్గాప్రసాద్, ఏఈ సరిత, నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






