శేరిలింగంపల్లి, జూన్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని డైనమిక్ కాలనీ వాసులు కాలనీలో నెలకొన్న వివిధ సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కాలనీ ప్రజల సమస్యలను విన్న శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డైనమిక్ కాలనీ వాసులు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలు, అవసరమైన అభివృద్ధి పనులపై తనను కలిసి వివరించారని తెలిపారు. త్వరలోనే కాలనీలో స్వయంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించి, సమస్యలను విడతల వారీగా పరిష్కరించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన వినతులు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని, పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో డివిజన్లో అత్యవసరంగా పనులు అవసరమైన ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

డైనమిక్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని శ్రీకాంత్ తెలిపారు. అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంతోపాటు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. మియాపూర్ డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కోటయ్య, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.





