రూ.530 కోట్లతో చేపట్టనున్న మియాపూర్ ఫ్లైఓవర్‌కు త్వరలో శంకుస్థాపన

శేరిలింగంప‌ల్లి, జూన్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ చౌరస్తా వరకు రూ.530 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక ఫ్లైఓవర్ ప్రాజెక్టుకు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుందని పీఏసీ చైర్మన్ ఆరెక‌పూడి గాంధీ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమం నేపథ్యంలో స్థలం, సభా ప్రాంగణం ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎంసీ కమిషనర్ సృజ‌న‌, డీసీపీ రితిరాజ్‌, జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌, డీసీ బాలకృష్ణ, ఏసీపీ రవికిరణ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌తోపాటు సీఎంసీ, హెచ్‌ఐసీటీఐ ప్రాజెక్టుల ఇంజినీరింగ్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

ప్రాజెక్టు కింద మియాపూర్ చౌరస్తా నుంచి ఆల్విన్ కాలనీ వరకు 1,790 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6-లేన్ ద్విముఖ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే హఫీజ్‌పేట్ నుంచి మియాపూర్ వరకు 3-లేన్ యూనీడైరెక్షనల్ అండర్‌పాస్, బాచుపల్లి నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు మరో 3-లేన్ యూనీడైరెక్షనల్ అండర్‌పాస్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణంతో మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్, బాచుపల్లి ప్రాంతాల మధ్య ట్రాఫిక్ సమస్యలకు గణనీయంగా ఉపశమనం లభిస్తుందని ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ప్రయాణ సమయం తగ్గడంతోపాటు ఇంధన వినియోగం కూడా తగ్గి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ రహిత సమాజం, మెరుగైన జీవన ప్రమాణాల లక్ష్యంతో భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపడుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సుమారు రూ.2వేల కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

ఇందులో భాగంగా రూ.459 కోట్లతో గచ్చిబౌలి ఐఐటీ జంక్షన్ ఫ్లైఓవర్, రూ.220 కోట్లతో ఖాజాగూడ జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, రూ.308 కోట్లతో లింగంపల్లి ఆర్‌వోబీ ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. అదేవిధంగా 10 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల, రూ.100 కోట్లతో కొండాపూర్, చందానగర్ ప్రాంతాల్లో కోర్ అర్బన్ పాఠశాలల నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని, అన్ని రంగాల్లో మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here