ఎన్టీఆర్ స్ఫూర్తితోనే శేరిలింగంపల్లి అభివృద్ధి: ఆరికెపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, మే 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయ‌న‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాల్లో తనకు ఓనమాలు నేర్పిన ఆదర్శమూర్తి ఎన్టీఆర్ అని, ఆయన ఆశయాలు, విలువలే తన రాజకీయ ప్రస్థానానికి దిక్సూచిగా నిలిచాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే తాను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసే స్థాయికి ఎదిగానని తెలిపారు. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులర్పించిన ఆరికెపూడి గాంధీ, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. రాముడు, కృష్ణుడు అంటే ఇలాగే ఉంటారనేలా కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.

సినీ రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ నవశకానికి నాంది పలికారని గాంధీ గుర్తుచేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. బ్రిటీష్ కాలం నాటి తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకువచ్చిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం ఎన్టీఆర్ చేసిన కృషి చారిత్రాత్మకమని ఆరికెపూడి గాంధీ అన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా మహిళలకు వారసత్వ ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ప్రభుత్వ సేవలను గ్రామీణ ప్రజలకు చేరువ చేస్తూ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశవ్యాప్తంగా సామాజిక, రాజకీయ మార్పులకు దారి తీశాయని విశ్లేషించారు. ఎన్టీఆర్ ఆశయాలతో ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చిన యువతలో తాను కూడా ఒకడినని గాంధీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను పలు మార్లు ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం తనకు దక్కిందని, ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయని చెప్పారు. ప్రజా నాయకుడు ప్రజల మధ్య ఎలా ఉండాలో, వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో ఎన్టీఆర్‌ను చూసే నేర్చుకున్నానని తెలిపారు.

ప్రపంచంలో తెలుగు మాట్లాడే చివరి వ్యక్తి ఉన్నంత వరకు ఎన్టీఆర్ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుందని ఆరికెపూడి గాంధీ స్పష్టం చేశారు. ఆయన ఆశయాల బాటలోనే శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలకు నిరంతరం సేవ చేస్తానని వెల్లడించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here