శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా రూ.79 కోట్ల 58 లక్షల అంచనా వ్యయంతో నాలాల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీనగర్ కాలనీలో పటేల్ చెరువు అలుగు నుంచి గంగారం చెరువు వరకు చేపడుతున్న RCC బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రూ.18 కోట్ల 92 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న RCC బాక్స్ డ్రైన్, RCC బెడ్, సైడ్ వాల్స్, నాలా విస్తరణ పనులను SNDP ఇంజనీరింగ్ అధికారులతో కలిసి గాంధీ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ SNDP ఫేజ్-2లో చేపడుతున్న నాలాల విస్తరణ పనులు లోతట్టు ప్రాంతాలకు భారీ ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.

ప్రతి వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వర్షాకాలానికి ముందే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నాలాల నిర్మాణ సమయంలో ప్రజలకు, ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి ప్రవాహం సాఫీగా సాగేలా సాంకేతిక ప్రమాణాలతో పనులు చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. నాలాల విస్తరణ, RCC బాక్స్ డ్రైన్ నిర్మాణం పూర్తయితే వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం కలుగుతుందని గాంధీ అన్నారు. పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో SNDP ఇంజనీరింగ్ విభాగం DE ధీరజ్, నాయకుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





