శేరిలింగంపల్లి, మే 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని మియాపూర్ సర్కిల్ చందానగర్‌లో సరస్వతి విద్యా మందిర్ నుంచి పీజేఆర్ స్టేడియం వరకు రహదారుల పక్కన చిరు వ్యాపారులుగా జీవిస్తున్న వారి స్ట్రీట్ వెండార్ స్టాల్స్‌ను ముందస్తు నోటీసులు లేకుండా కూల్చేయడం దారుణమని, వెంటనే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సర్కిల్ ఉప కమిషనర్ శశిరేఖకు పలువురు స్ట్రీట్ వెండార్లతో కలిసి సీపీఎం శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణ శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదరు చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తున్నారని, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలపై అధికారులు దాడులు చేసి వారి సెంటర్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారని అన్నారు. ముందస్తు నోటీసులు లేకుండా అకస్మాత్తుగా జేసీబీలతో వచ్చి కూల్చివేతలు చేపట్టడం దారుణమన్నారు. జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకుని చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ వెండార్ యూనియన్ నాయకుడు కాసం సతీష్, సభ్యులు శ్రీను, జి.బాలు, ఎస్.మాలతి, జి.ప్రియ, టి.ప్రసన్న, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.






