లిఫ్ట్ గ్రిల్స్ మధ్య ఇరుక్కుని బాలిక మృతి

శేరిలింగంప‌ల్లి, మే 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): లిఫ్ట్ గ్రిల్స్ మధ్య ఇరుక్కున్న బాలిక తల ఛిద్రమై మృతిచెందిన హృదయ విదారక సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ బాలరాజు తెలిపిన ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన బిట్టు ఘోష్, అతని తండ్రి మోహన్ ఘోష్ గౌలిదొడ్డిలోని మహి ఉమెన్స్ పీజీ హాస్టల్‌లో గత ఏడేళ్లుగా వంట మనుషులుగా పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వంట చేస్తుండగా బిట్టు కూతురు విస్తు ఘోష్ (5) ఆడుకుంటూ బుధవారం ఉదయం 10.58 గంటల సమయంలో లిఫ్ట్ ఎక్కింది. ఉదయం 11.06 గంటల సమయంలో హాస్టల్‌లో ఉండే ఓ ఐటీ ఉద్యోగి మూడో ఫ్లోర్‌లో లిఫ్ట్ కోసం వచ్చి చూడగా బాలిక గ్రిల్స్‌లో ఇరుక్కుపోయి ఉండటం గమనించి తండ్రికి సమాచారం అందించారు. వెంటనే డయల్ 100కు కాల్ చేయడంతో గచ్చిబౌలి పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలికను బయటకు తీశారు. లిఫ్ట్ లోపలి, బయటి గ్రిల్స్ మధ్య పడటంతో తల వెనక భాగం ఊడిపోయింది. విస్తు ఘోష్ లిఫ్ట్‌లోకి ఎక్కిన సీసీ కెమెరాలు ఫుటేజీ మాత్రమే కనిపిస్తుందని, లోపల ఏమి జరిగిందో తెలియడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ మేర‌కు పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here