శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ హాజరు కానున్న భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ కోరారు. ప్రధాని మోదీ సభ నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రచార కార్యక్రమాలపై బుధవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గురువారం ఉదయం తారా నగర్ తుల్జా భవాని టెంపుల్ దగ్గర నుండి మియాపూర్ బొల్లారం చౌరస్తా వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలందరిని మోడీ సభకు హాజరయ్యే విధంగా యువమోర్చా నాయకులు చొరవ చూపాలని కోరారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి, వసంత్ యాదవ్, చంద్రమౌళి , అర్జున్ , మల్లేష్ గౌడ్, సామ్రాట్ గౌడ్, సందీప్, మాన్యం యాదవ్, బంటి, కరణ్ గౌడ్ పాల్గొన్నారు.






