శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానామెట్ ఈదులకుంట చెరువును కబ్జా నుంచి రక్షించాలని కోరుతూ రాజేంద్రనగర్ ఆర్డీవోకి సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పానుగంటి పర్వతాలు బుధవారం వినతిపత్రం అందజేశారు. తక్షణమే ప్రభుత్వ భూములను రక్షించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని అన్నారు. ఖానామెట్ ఈదులకుంట చెరువు ఆరు ఎకరాల ఐదు కుంటలు ఉంటుందని, చెరువును సెల్లార్ కొట్టి రాత్రికి రాత్రే నిర్మాణాలు చేపట్టబోతున్న ఎస్విఎన్ కన్స్ట్రక్షన్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖానామెట్ గ్రామ పరిధిలోని ఈదులకుంట చెరువును కొందరు వ్యక్తులు కబ్జా చేసి సెల్లార్ తవ్వకాల వంటి నిర్మాణాలు చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. చెరువు వంటి ప్రజా ఆస్తిని నాశనం చేయడం వల్ల గ్రామ ప్రజల జీవనాధారంపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రామకృష్ణ, రాష్ట్ర సమితి సభ్యుడు కే చందు యాదవ్, శేరిలింగంపల్లి మండల కార్యదర్శి తుపాకుల రాములు, ఏఐటియుసి మండల అధ్యక్షుడు జెట్టి శ్రీనివాస్, మండల సహ కార్యదర్శి, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






