క్యాంపు కార్యాలయం ఉండగా.. MLA ఇంట్లో అధికారిక సమీక్ష సమావేశాలా: మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరుకున్నాయని, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సిఎంసి జోనల్ కమీషనర్ హేమంత్ కి బీఆర్ఎస్ సీనియర్ మహిళా నేత, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పీఏసీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ నివాసంలో సిఎంసీ అధికారులతో, ఏ పదవీ లేని మాజీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలను, ప్రొటోకాల్‌ను గాలికొదిలేసి ఎమ్మెల్యే గాంధీతోపాటు అధికారులు వ్యవహరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

శేరిలింగంపల్లి, మియాపూర్, ఆల్విన్ కాలనీ సర్కిళ్ల పరిధిలోని అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, సీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆయ‌న‌ ఇంట్లో సమీక్షా సమావేశం నిర్వహించార‌ని, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అధికారిక సమావేశాల నిర్వహణ కోసం మియాపూర్‌లో సకల హంగులతో అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించార‌ని, అంత మంచి క్యాంపు కార్యాలయం అందుబాటులో ఉండగా, మియాపూర్ సర్కిల్ అధికారులను కూకట్‌పల్లిలోని తన ఇంటికి పిలిపించుకుని అధికారిక సమావేశాలు ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేంటి? అని ఆమె నిలదీశారు. అధికారులతో, అందులోనూ ఈఈ శిరీష, డీఈ శ్రీదేవి, డీఈ మౌనిక వంటి మహిళా అధికారులను ఇంటికి (లేదా అనధికారిక ప్రదేశానికి) పిలిపించి మీటింగ్ పెట్టడం గౌరవంగా ఉందా ఎమ్మెల్యే గారూ? ఇది మహిళలను అవమానించినట్లు కాదా? అని నవతా రెడ్డి ప్రశ్నించారు.

పాలనాపరమైన, అధికారిక సమీక్షలను ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో హుందాగా నిర్వహించాల్సిన బాధ్యతను గాలికి వదిలేశారని విమర్శించారు. అధికారులు సైతం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లి సమీక్షల్లో పాల్గొనడం సరికాదని ఆమె హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏఈలు భాస్కర్, యుగేంధర్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ.. అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. అధికారులతో ప్రజాప్రతినిధులు నిర్వహించే అధికారిక సమీక్షా సమావేశంలో ప్రస్తుతం ఎలాంటి అధికారిక హోదా లేని మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ భర్త, ఇతర కాంగ్రెస్ నాయకులు ఏ అర్హతతో కూర్చున్నారని నవతా రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

మూడు సర్కిల్ లలో ఈ ముగ్గురికి తప్ప వేరే వారికి అర్హత లేదా? ఏ హక్కుతో మాజీ కార్పొరేటర్లను, మహిళా నేతల భర్తలను అధికారుల సమావేశానికి పిలిచారు? పాలనాపరమైన, అభివృద్ధి పనుల సమీక్షల్లో అధికారులను ఆదేశించే, లేదా వారితో చర్చించే అధికారిక హోదా వారికి ఎక్కడిది? ఇది ముమ్మాటికీ ప్రొటోకాల్ ఉల్లంఘన, అధికార దుర్వినియోగమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్ధమైన పరిపాలన సాగాల్సిన చోట ఇలాంటి అనధికారిక జోక్యాలను సహించేది లేదని, అధికారులు చట్టపరంగా, నిబంధనల మేరకే విధులు నిర్వర్తించాలని లేని ఎడల చట్టం వారిని శిక్షించే విధంగా ఉన్న‌తాధికారుల‌ దృష్టికి తీసుకువెళ్తామ‌ని బొబ్బ నవతా రెడ్డి హెచ్చరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here