చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని పట్టభద్రులు తమ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి అన్నారు. గురువారం ఆమె డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీలో 15 మంది పట్టభద్రులతో కలిసి ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలో ఉన్న పట్టభద్రులు తమ గ్రాడ్యుయేట్ ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని అన్నారు.
2017 సంవత్సరం కంటే ముందు డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ తదితర డిగ్రీలలో ఉత్తీర్ణులైన వారు పట్టభద్రులుగా ఓటు హక్కును నమోదు చేయించుకోవచ్చని తెలిపారు. ఓటు హక్కును పొందితే రానున్న రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ఓటు హక్కు లేని పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకుని రాబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ సురేందర్, సురేష్, నవీన్, గౌస్, సాయి ప్రశాంత్, సాయి, సతీష్, సురేష్, అభిలాశ్, పవన్, శివ, జహీర్, శివ, ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.