శేరిలింగంపల్లి, మార్చి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అసంపూర్తిగా మిగిలిపోయిన లింక్ రోడ్లను పూర్తి చేయాలని గురువారం అసెంబ్లీలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హైటెక్ సిటీ గౌసియా కేఫ్ నుండి కొత్తగూడ హర్ష టాయోట వరకు 100 ఫీట్ల రోడ్డు, అపర్ణ హిల్ పార్క్ నుండి గంగారం హనుమాన్ దేవాలయం వద్ద జాతీయ రహదారికి కలిపే లింక్ రోడ్డు, నల్లగండ్ల రత్నదీప్ సూపర్ మార్కెట్ నుండి శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ వరకు కలిపే లింక్ రోడ్డు, ముంబాయి జాతీయ రహదారి NH 65 మై హోమ్ జ్యువెల్ నుండి వయా రైల్వే ట్రాక్ మీదుగా జోనల్ కార్యాలయంకు కలిపే ప్లై ఓవర్, లింక్ రోడ్డు పనులను ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి వెంటనే పూర్తి చేయాలని కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ప్రజానీకం నివసిస్తున్నారని, అత్యధిక ట్రాఫిక్ ప్రాంతం అని, గతంలో నాలుగైదు లింక్ రోడ్లు మంజూరై సగం పనులు పూర్తి అయ్యాయని, పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు.

అధికారుల కొరత, భూ సేకరణలో ఆలస్యం తదితర కారణాల వల్ల రహదారుల నిర్మాణం సగంలో ఆగిపోయిందని గాంధీ తెలిపారు. వెంటనే అవసరం ఉన్న అధికారులను నియమించాలని, అసంపూర్తిగా మిగిలిన లింక్ రోడ్లను పూర్తి చేయాలని, ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని కోరారు. ఈ లింకు రోడ్లను పూర్తి చేయడం వల్ల ఎంతో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, ప్రజలకు విలువైన సమయం ఆదా అవుతుందని, వాహనాల ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, ప్రజలకు ఊరట లభిస్తుందని పేర్కొన్నారు.





