శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు

శేరిలింగంపల్లి, మార్చి 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గోపన్ పల్లి గ్రామం లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకల‌ను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఈ సంద‌ర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు, స్వామివారి ఆభరణాల ఊరేగింపు, వస్త్రాలంకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించగా, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని దైవానుగ్రహం పొందారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

దశాబ్దాలుగా గోపన్‌పల్లి గ్రామంలో ఉగాది వేడుకలను గ్రామ పెద్దల సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గంగాధ‌ర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక, సాంప్రదాయ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి కృపతో ప్రజాసేవలో ముందుకు సాగుతున్నానని, రాబోయే రోజుల్లో కూడా ప్రజల మద్దతు కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, బీజేపీ శ్రేణులు, భక్తులు, స్థానిక నాయకులు, మహిళలు, పిల్లలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here