శేరిలింగంపల్లి, జూన్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): పనిచేస్తున్న సంస్థలో ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మదీనాగూడలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహన షోరూంలో నక్క కిశోర్ కుమార్ (31) అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మియాపూర్‌లోని వాణీ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా జూన్ 2వ తేదీన ఉదయం 5.40 గంటల సమయంలో కిశోర్ కుమార్ సదరు షోరూం ప్రధాన విద్యుత్ సరఫరా లైన్‌ను నిలిపివేశాడు. అనంతరం షోరూంలో ఉన్న ఓ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ద్విచక్ర వాహనం (TS 07KH 0839)ను దొంగిలించాడు. ఈ క్రమంలో మేనేజర్ కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నక్క కిశోర్ కుమార్‌ను అరెస్టు చేసి అతని నుంచి వాహనాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్‌కు తరలించారు.