- ట్రాఫిక్ నిబంధనలను పాటించాలి
- మద్యం, డ్రగ్స్ మత్తులో వాహనాలను నడిపించకండి
- వాహనదారులకు పోలీసుల సూచనలు
మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన అర్ధరాత్రి 1.15 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆ ప్రమాదానికి కారకులైన ఇద్దరిలో ప్రధాన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌కు చెందిన వెంకట రామా రావు రంగారెడ్డి జిల్లా బాచుపల్లి రెసినియా ఇంటెల్లి పార్క్‌లో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు మంచెం కాశీ విశ్వనాథ్ యూసుఫ్‌గూడలోని మధురానగర్‌కు చెందిన తన స్నేహితుడు కౌశిక్ రెడ్డితో కలిసి ఈ నెల 12వ తేదీన కొండాపూర్‌లో ఉన్న అరుణాచల కార్ వర్క్‌షాప్‌కు వెళ్లారు. అక్కడ తమ ఐ10 కారు (ఏపీ09సీవీ0530)ను వదిలేసి సర్వీసింగ్ పూర్తి అయిన బెంజ్ కారు (ఏపీ39ఈహెచ్0555)ని తీసుకుని క్లబ్ రోగ్ పబ్‌కు వెళ్లారు. అప్పటికే ఇద్దరూ మద్యం సేవించి ఉన్నారు. అయినప్పటికీ కారును తీసుకుని మళ్లీ సదరు పబ్‌కు వెళ్లి అక్కడ మద్యం సేవించారు. బయటకు వచ్చి మాదాపూర్‌లోని లక్కీ రెస్టారెంట్ వద్ద సిగరెట్ ప్యాకెట్లు కొన్నారు. అనంతరం సిగరెట్లలో గంజాయి ఉంచి తాగారు. తరువాత బెంజ్ కారులో సైబర్ టవర్స్ జంక్షన్ మీదుగా కూకట్పల్లి వైపుకు బయల్దేరారు.
మార్గమధ్యలో సైబర్ టవర్స్ జంక్షన్ వద్ద సిగ్నల్ జంప్ చేశారు. దీంతో మాదాపూర్ నుంచి కొండాపూర్ వైపుకు వస్తున్న బుల్లెట్ ద్విచక్ర వాహనం (టీఎస్07జీఎక్స్0422)ను వేగంగా ఢీకొన్నారు. ఈ ఘటనలో బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న కొండాపూర్ హఫీజ్‌పేటలోని జీఎంఆర్ రెసిడెన్సీలో నివాసం ఉండే ప్రైవేటు ఉద్యోగి గౌతమ్ దేవ్ గడయ్ (36), అతని భార్య శ్వేతా శ్రావణి (32)లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా గౌతమ్ అక్కడికక్కడే చనిపోగా శ్వేతా శ్రావణిని చికిత్స నిమిత్తం సమీపంలోని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్లో ఒకడైన మంచెం కాశీ విశ్వనాథ్ ను సోమవారం అరెస్టు చేసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. అతని స్నేహితుడు, మరో నిందితుడు అయిన కౌశిక్ రెడ్డి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా వారిపై ఐపీసీ సెక్షన్లు 304 పార్ట్-2, 337, 109తోపాటు మోటార్ వాహన చట్టం సెక్షన్లు 184, 185, 187, ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 20 (బి) కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
మద్యం మత్తులో డ్రైవింగ్ వద్దు…
ఇటీవలి కాలంలో మద్యం మత్తు ప్రమాదాలు ఎక్కువైన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు వాహనదారులకు పలు సూచనలు జారీ చేశారు. రహదారులపై స్పీడ్ లిమిట్ పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకూడదని, వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలని, ఏయే వాహనాల్లో ఏయే రోడ్లపై ఎలా ప్రయాణించాలో వాహనదారులకు కచ్చితమైన అవగాహన ఉండాలని, మద్యం లేదా డ్రగ్స్ మత్తులో వాహనాలను నడపకూడదని సూచించారు.