పెండింగ్​ స్కాలర్​షిప్​ల‌ను వెంటనే విడుదల చేయాలి: ఏబీవీపీ

కూక‌ట్‌ప‌ల్లి, అక్టోబ‌ర్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్​లో ఉన్న విద్యార్థుల స్కాలర్​షిప్​లు, ఫీజు రియంబర్స్​మెంట్స్​ రూ.7500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్​ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో ధర్నా, రాస్తారోకో, నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కూకట్ ప‌ల్లి జిల్లా కన్వీనర్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న రూ. 7500 కోట్ల‌ స్కాలర్​షిప్స్‌​, ఫీజు రీయంబర్​మెంట్స్​ వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే కాంగ్రెస్​ ప్రభుత్వం ఉచితాలకు కాకుండా విద్యార్థుల పక్షాన ఉండి వారికి మేలు చేయాల్సింది పోయి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

రాస్తారాకో నిర్వ‌హిస్తున్న ఏబీవీపీ నాయ‌కులు

ఈ విషయంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించనట్లయితే రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి బుద్దిచెబుతామని హెచ్చరించారు. అలాగే పెండింగ్​ స్కాలర్​షిప్​లు, రీయంబర్​మెంట్స్​ విడుదల చేయడంతోపాటు స్కాలర్​షిప్​లను రూ.3 వేలకు పెంచి నెలవారీగా చెల్లించాలని, ఎంఈవోలు, డీఈవోలతోపాటు మెగా డీఎస్సీ రిక్రూట్​మెంట్​ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ఫీజుల దోపిడీని అరికట్టాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాల్సిందిగా రాష్ట్ర నాయకులు డిమాండ్​ చేశారు.

నాయ‌కుల‌ను అరెస్టు చేస్తున్న పోలీసులు

యూనివర్సిటీలలో ఆశాస్త్రీయంగా పెంచిన పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజులను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ రెడ్డి, ఆయుష్, కూకట్ ప‌ల్లి నగర కార్యదర్శి ధనంజయ, చరణ్, ఉదయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here