దుర్గం చెరువు కేబుల్ వంతెనకు పోటెత్తుతున్న సందర్శకులు
మాదాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోకి ప్రజలను ఆకట్టుకునేలా కొత్తగా ఏదైనా వచ్చింది అంటే సిటీ జనాలు పోటెత్తడం సహజమే. అందులోనూ పర్యాటక ప్రాంతమైతే వచ్చే సందర్శకుల తాకిడిని ఊహించలేం. తాజాగా మాదాపూర్ దుర్గం చెరువు వద్ద నిర్మితమవుతున్న తీగల వంతెన (కేబుల్ బ్రిడ్జ్) పై పర్యాటక ప్రియుల కన్ను పడింది. కాలానుగుణంగా పచ్చదనంతో సహజ సోయగాలు పులుముకున్న దుర్గం చెరువు ప్రాంతానికి అధునాతన టెక్నాలజీ తోడై మరింత శోభను తీసుకువచ్చింది.
184 కోట్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెన నగరవాసుల మనసు దోచుకునేందుకు సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ప్రారంభోత్సవం జరుగనుండగా యువత ముందుగానే కేబుల్ వంతెనను వీక్షించడానికి తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ వేలాదిమంది పర్యాటకులు కేబుల్ వంతెనను సందర్శిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. వారాంతాల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. ఓ వైపు యువత సెల్ఫీలు, మరోవైపు చిన్నారులతో కుటుంబ సభ్యుల కాలక్షేపాలతో దుర్గం చెరువు సందడి గా మారిపోయింది.