చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పేదలు కష్టంలో ఉన్నప్పుడు వారికి తినడానికి కావలసిన నిత్యావసర వస్తువులను సాయం చేయడం వలన వచ్చే సంతృప్తి మరెందులోనూ దొరకదని మిరియాల చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల యామిని దివ్య అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలో భారీ వర్షాల వలన ముంపు ప్రాంతాలలో నివసించే ప్రజలు వరదల వలన ఇండ్లలోని వస్తువులను కోల్పోయి కష్టాల్లో ఉన్నారని తెలుసుకుని మిరియాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సోమవారం జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువుల కిట్లను ట్రస్ట్ డైరెక్టర్ మిరియాల యామిని దివ్య అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద ప్రజలకు మిరియాల చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. రోగనిరోధక శక్తినిచ్చే హోమియోపతి మందులను కూడా ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. కరోనా వంటి విపత్కర సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందజేసిన సేవలు వెలకట్టలేనివని ఆమె అన్నారు. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీల సహకారంతో ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవ రావు, టీఆర్ఎస్ యువజన నాయకుడు మిరియాల ప్రీతమ్ పాల్గొన్నారు.






