- AIFDY రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ పిలుపు
నమస్తే శేరిలింగంపల్లి: షహీద్ భగత్ సింగ్ 115వ జయంతి కార్యక్రమాన్ని మియాపూర్ మెయిన్ రోడ్డు (ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రోడ్డు)లో AIFDY ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన AIFDY రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి మాట్లాడుతూ.. నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులను దేశం నుంచి పారదోలడానికి దేశభక్తితమైన కుటుంబంలో 19O7 సెప్టెంబర్ 28న పంజాబీ రాష్ట్రం లాయల్ పూరి జిల్లా బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించారని గుర్తు చేశారు. అతి చిన్న వయసులో జలీయన్ వాల బాగ్ సంఘటనతో తన జీవితాన్ని దేశానికి అంకితమిచ్చిన గొప్ప నాయకుడని, 23 సంవత్సరాల వయసులో స్వాతంత్రం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన యువకిశోరమని కొనియాడారు. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం భగత్ సింగ్ నినాదమని అన్నారు.
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ స్వాతంత్ర ఫలితాలు సామాన్య ప్రజలకు అందలేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం నేటి పాలకుల చేతిలో కూని చేయబడుతుందని ఆరోపించారు. దేశ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారిన కుల వ్యత్యాసాలు, మత ఉన్మాదాలు నేటి పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా ఉండి దేశంలో మెజార్టీ ప్రజలపై కుల, మత దాడులు జరుగుతున్నాయని అరోపించారు. భగత్ సింగ్ కలలుగన్న భారత స్వాతంత్రం ఇది కాదని కులాలు, మతాలు లేని సమానత్వ మానవత్వ సమాజాన్ని రూపొందించడమే నేటి యువత కర్తవ్యమని ఆయన అన్నారు. భగత్ సింగ్ ఆశ స్ఫూర్తితో కుల, మతాల కుంపటి నుండి భారతదేశాన్ని కాపాడాలని యువతకు పిలుపునిచ్చారు. AIFDY రాష్ట్ర కమిటీ సభ్యులు డి మధుసూదన్ మాట్లాడుతూ యువ నాయకులను సమీకరించి దేశ యువతను ఆకర్షించే కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ స్పూర్తితో నేడు పాలకవర్గాలు అనుసరించే పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా AIFDY పోరాటాలు నిర్వహిస్తుందని, అందులో యువత పెద్ద సంఖ్యలో భాగస్వామ్యమై ఈ పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. AIFDY గ్రేటర్ హైదరాబాద్ యువతుల విభాగం కన్వీనర్ సుల్తానా బేగం మాట్లాడుతూ నేడు దేశంలో, రాష్ట్రంలో పాలకులు, స్వాతంత్ర సమరయోధుల చరిత్రను కనుమరుగు చేస్తున్నారని, స్వాతంత్ర ఉద్యమ చరిత్రను నేటి తరానికి తెలియకుండా ఉండేందుకు పాలకులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు యువతను మత్తు పదార్థాల వైపు, చెడు అలవాట్లవైపు పయనింపచేసే దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, వీటికి వ్యతిరేకంగా యువతీ, యువకులు భగత్ సింగ్ ఆశయ స్ఫూర్తితో పోరాడుదామని అన్నారు. AIFDY రాష్ట్ర కమిటీ సభ్యులు పి శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో AIFDY గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు డి శ్రీనివాసులు, బి.రవి, కె షరీశ్, కే రాజు, రంగస్వామి, ఈ దశరథ్ నాయక్, AIFDS రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి, AIFDW రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి లావణ్య, మైదాన ప్రాంత గిరిజన సంఘం రాష్ట్ర కన్వీనర్ వి తుకారాం నాయక్ కూడా పాల్గొని మాట్లాడారు. కన్నా శ్రీనివాస్, డి నరసింహ, పద్మరాజు, రవికాంత్, నేహా, వినీల కార్యక్రమంలో పాల్గొన్నారు.