మాతృశ్రీనగర్ పార్కులో వెలసిన నిర్మాణాల తొలగింపు తప్పదు – కూల్చివేత ఆదేశాలపై స్టే కు నిరాకరించిన హైకోర్టు

నమస్తే శేరిలింగంపల్లి: గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న మియాపూర్ మాతృశ్రీ నగర్ పార్కు కట్టడాల వివాదంలో హైకోర్టు ప్రస్తుతం అమలులో ఉన్న కూల్చివేత ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పబ్లిక్ పార్కు స్థలంలో అక్రమంగా అసోసియేషన్ బిల్డింగ్, షెడ్డు, మరియు గుడి నిర్మించినా జీహెచఎంసీ చర్యలు చేపట్టట్లేదంటూ ఈ ఏడాది మార్చిలో సామాజిక కార్యకర్త వినయ్ వంగల వేసిన రిట్ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ లలిత కన్నెగంటి ధర్మాసనం నెలరోజుల్లో చట్టపరమైన చర్యలు చేపట్టి రిపోర్టు ఫైల్ చేయాలని జీహెచఎంసీకి ఆదేశాలు జారీ చేసింది.

పార్కు స్థలంలో వెలిసిన నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది

నెలలు గడుస్తున్నా చర్యలకు ఉపక్రమించకపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులపై గత నెల పిటిషనర్ వినయ్ వంగల కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఆ కేసు ఈ నెల 27వ తారీఖున విచారణకు రానుంది. ఈ క్రమంలో బల్దియా అధికారులు పోలీసుల సాయంతో మంగళవారం అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు. దీని పై కాలనీ అసోసియేషన్ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం జీహెచఎంసీ పార్కులో బిల్డింగ్, గుడి కట్టడానికి మీరెవరని కాలనీ అసోసియేషన్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నామని కాలనీ తరపు న్యాయవాది శివ కుమార్ తెలుపగా ప్రజల కోసం అటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి సరిపడా ప్రభుత్వ విభాగాలు ఉన్నాయిని, మీరు పార్కు స్థలంలో బిల్డింగ్లు, గుళ్ళు కట్టి సమాజ సేవ చేయనవసరం లేదు అని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది.

మాతృశ్రీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ షెడ్ ను తొలగించిన దృశ్యం

కాగా, జీహెచ్ఎంసీకి చెందిన పార్కు స్థలంలో బిల్డింగ్, గుడి, షెడ్డు వంటి నిర్మాణాలు చేపట్టినట్టు కాలనీ అసోసియేషన్ వారే వారి అఫిడవిట్ లో ఒప్పుకోవడంతో పాటు మాతృశ్రీ నగర్ కు చెందిన మిగతా పార్కులు మరియు చుట్టుపక్కల కాలనీల్లోని ఇతర పార్కుల్లో కూడా ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయని ఆ అఫిడిట్ లో పేర్కొనడాన్ని ఎత్తిచూపిన పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్నంశెట్టి అఖిల్ వాటన్నిటిపై కూడా విచారణ చేపట్టి కూల్చివేత చర్యలు తీసుకోవాలని హైకోర్టును అభ్యర్థించారు. ఇప్పటికే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసిన జీహెచఎంసీ, పార్కులో అక్రమంగా నిర్మించిన బిల్డింగ్ తో సహా అన్ని కట్టడాలను కూల్చివేసి, పచ్చదనం పెంచడానికి చర్యలు చేపడతామని హైకోర్టుకు తెలిపింది. దాంతో అమలులో ఉన్న కూల్చివేత ఆదేశాల పై ఎటువంటి జోక్యం చేసుకోబోమన్న ధర్మాసనం విచారణను తదుపరి తేదీకి వాయిదా వేసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here