నేడు డాన్స్ విభావరి నృత్య ప్రదర్శన
నమస్తే శేరిలింగంపల్లి: ప్రగతి ఎంక్లేవ్ వినాయక మండలి నిర్వహించే గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా మన ప్రగతి ఎంక్లేవ్ కళామండపంలో, శనివారం సాయంత్రం డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో భరతనాట్య సంప్రదాయంలో నృత్యప్రదర్శన నిర్వహించనున్నది. 25 సంవత్సరాలుగా విభావరీ డ్యాన్స్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ సముద్రాల మాధవీ రామానుజం నాట్యశిక్షణ అందిస్తున్నారు.
అనేకమంది విద్యార్థులచే భరతనాట్యంలో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు పూర్తిచేయించారు. రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత కీర్తిశేషులు డాక్టర్ కె.ఉమా రామారావు వీరి నాట్యగురువు. సముద్రాల మాధవీ రామానుజం “ఆచార్యత్రయం” అనే నృత్యరూపకాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించారు. చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో వీరు ఈ నృత్యరూపకాన్ని 120 మార్లు ప్రదర్శించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు నుంచి గుర్తింపు పొందారు. గత పదిసంవత్సరాలుగా జగదాచార్యులైన శ్రీ భగవద్ రామానుజాచార్య వైభవాన్ని తెలుపుతూ ఎన్నో నృత్యరూపకాలు రూపొందించి ప్రదర్శిస్తున్నారు.
నిర్విరామంగా నాట్యసేవ చేస్తూ విశిష్టపురస్కారం అందుకున్నారు.
విభావరి డ్యాన్స్ అకాడమీ పక్షాన ఈనాటి ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన
ప్రగతి ఎంక్లేవ్ వినాయక మండలి వారికీ కోఆర్డినేట్ చేసిన ఆర్. బాల త్రిపురసుందరి కీ ధన్యవాదములు తెలుపుకుంటూ …
నృత్యవిభావరి…
1. ఈనాటి నాట్యప్రదర్శన భరతనాట్య సంప్రదాయమును అనుసరిస్తూ పుష్పాంజలితో ఆరంభమౌతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండమునకు స్థితి కారకులు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణులకు నమస్సుమాంజలులు సమర్పిస్తూ… నాట్యకళకు అధిదేవతలైన పార్వతీ పరమేశ్వరులకు నృత్యాంజలి ఘటిస్తూ… సకల విఘ్న నివారకులైన వినాయకస్వామిని ప్రార్థిస్తూ… చదువుల తల్లి సరస్వతీమాతను ప్రస్తుతిస్తూ సాగే పుష్పాంజలి…
అవలోకించండి.
2. విభావరి డ్యాన్స్ అకాడమీ వారందరూ కలిసి ఇప్పుడు “శ్రీ భగవద్ రామానుజ వైభవం” అనే కీర్తన ప్రదర్శించనున్నారు. ప్రపంచం లోనే అత్యధిక ప్రదర్శనలు జరిగిన రికార్డ్ గల
నృత్యరూపకం ఆచార్యత్రయం. ఆ ఆచార్యత్రయం నృత్యరూపకం లోనిదే ఈ కీర్తన.
సమతా మూర్తీ గా మన భాగ్యనగరంలో వెలసిన భగవత్ రామానుజుల వైభవమును తెలిపే కీర్తన ఇది. రాగమాలిక … తాళమాలిక… రచన శ్రీ సముద్రాల రామానుజాచార్య సంగీతం శ్రీ వడలి ఫణినారాయణ.
3. తదుపరి నృత్యాంశం.. నటేష కౌతం.. భరతనాట్య సంప్రదాయంలో కిత్తం అనే శబ్దాలతో కూడుకొని నటరాజు ను స్తుతిస్తూ సాగే నృత్యాంశం… ఈ నటేష కౌతం. అవలోకించండి… ఆనందించండి.
4. భరతనాట్యాంశాల్లో అలరింపు, జతిస్వరం, శబ్దం తరువాత వచ్చే అంశం కీర్తన …కీర్తన అనే నాట్యప్రక్రియ దేవతామూర్తిని స్తుతిస్తూ సాగుతుంది. ఇప్పుడు మనముందు విభావరి డ్యాన్స్ అకాడమీ ప్రదర్శించే కీర్తన, ఆధ్యాత్మ రామాయణ కీర్తన. పరమశివుడిని స్తుతిస్తూ ఆయన గుణగణాలను ప్రస్తుతిస్తూ సాగుతుంది ఈ కీర్తన. సమ్మొహనకరమైన మందహాసాన్ని వర్ణిస్తూ యోగులకు ఆనంద కారకుడని కీర్తిస్తూ నందివాహనుడైన ఆ పరమేశ్వరుడిని ప్రార్థించే కీర్తన ఇది.
ధన్యాసిరాగం… ఆదితాళం…
5. ఈనాటి నృత్యవిభావరిలో చివరి అంశం “యతిపతి జైత్రయాత్ర” శ్రీ భగవద్ రామానుజులు భారతదేశమంతటా మూడుసార్లు జైత్రయాత్ర చేసారు. జైత్రయాత్రలో భాగమైన మేల్కోట వృత్తాంతమును వివరించేదే ఈ నృత్యరూపకం… “యతిపతి జైత్రయాత్ర” ఇది … రాగమాలిక .. తాళమాలిక.. రచన శ్రీ సముద్రాల రామానుజాచార్య, సంగీతం వదలి ఫణినారాయణ ఈనాటి నృత్యవిభావరి సుసంపన్నం అయినది.
అతిథి దేవో భవ…
అతిథులు దైవ స్వరూపులుగా భావిస్తుంది భారతీయ సంప్రదాయం, అట్టి సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ … ఈనాటి నృత్యప్రదర్శనతో మనను అలరించిన కళాకారులను సన్మానించుకోనున్నట్లు తెలిపారు.