నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో సురభికాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గురుపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ పాఠశాలను ఆయన ఆరు సంవత్సరాల క్రితం తన సొంత నిధులు సుమారుగా 50 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించారు. సోమవారం గురుపూజోత్సవం సందర్భంగా భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యాపకులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ విశ్వంలోనే అత్యంత గౌరవ ప్రదమైనది ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు. భవిష్యత్తు సమాజ నిర్ధేశకులు అధ్యాపకులే అని అన్నారు. భావిభారత పౌరులైన విద్యార్థిని, విద్యార్థులను సర్వతో ముఖాభివృద్దిగా తీర్చిదిద్దే వారే అధ్యాపకులు అని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాస్ రెసిడెన్షి కాలేజీలో అధ్యాపకుడిగా తన జీవితాన్ని ప్రారంభించారని, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచార్యుడుగా, ఉపకులపతిగా, విద్యారంగంలో సంస్కరణల కమిటీ అధ్యక్షుడిగా విదేశ రాయబారిగా, భారత ఉపరాష్ట్రపతిగా, రాష్టప్రతిగా పనిచేసి దేశప్రతిష్ఠలు ఇనుమడింప జేసిన భారతమాత ముద్దుబిడ్డ అని అన్నారు. రాధాకృష్ణన్ గొప్ప తత్వశాస్త్రవేత మాత్రమే కాదనీ, ప్రపంచం గుర్తించిన మేధావి అని తెలిపారు. ఈ సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఆయన జన్మదినాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటూ, ఈ సందర్భంగా అధ్యాపకులను గౌరవపూర్వకంగా సత్కరించటం జరుగుతుందని అన్నారు. ఆయన నైతిక, మానవతా విలువలతో కూడిన జీవనాన్ని గడిపి తను అందరికీ ఆదర్శ ప్రాయుడయ్యాడని తెలిపారు. అధ్యాపక వృత్తికి ఉన్నటువంటి విశిష్ట స్థానాన్ని మించి మరొకటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు దేవదాసు, అధ్యాపకులు ఆశ్రఫ్, మల్లికాంబ, మహేశ్వరి, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ బస్వరాజ్, రాజీవ్ గృహకల్ప వార్డ్ మెంబర్ శ్రీకళ, గోపాల్ యాదవ్, రోజా, పాఠశాల సిబ్బంది, మిడ్ డే మిల్స్ సిబ్బంది పాల్గొన్నారు.