నమస్తే శేరిలింగంపల్లి: వర్షాకాలంలో వ్యాధులు ప్రభలకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన పది ఆదివారాల పాటు ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాలకు ‘పరిసరాల శుభ్రత’ కార్యక్రమంలో భాగంగా స్టాలిన్ నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులు స్థానికులతో కలిసి పరిసరాల శుభ్రత పై ఇంటింటా ప్రజలకు అవగాహన కల్పించారు. చందానగర్ సర్కిల్ మలేరియా నిర్మూలన విభాగం ఏఈ గణేష్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రభలే వ్యాధుల వలన ప్రజలు అనారోగ్యానికి గురవుతారని, ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి తమ ఇంటి పరిసరాలతో పాటు కాలనీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఆదివారం పదినిమిషాల కార్యక్రమం ద్వారా ప్రజలకు వర్షాకాలంలో వ్యాధుల పైన అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ముఖ్యంగా అంటు వ్యాధులు, విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని, దోమల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ ఇండ్లలో నీరు నిల్వ ఉంచకూడదని, రోడ్ల పైన, పక్కన పరిసర ప్రాంతాలలో చెత్త వేయకూడదని అన్నారు. నిలువ నీరు ఉంటే వాటిని తీసివేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని, ప్రతి ఇంటితోపాటు కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుందామని ప్రజలందరం ఆరోగ్యంగా ఉందామని అన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, స్టాలిన్ నగర్ వాసులు పాల్గొన్నారు.