నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా ఉద్యమాల బలోపేతమే లక్ష్యంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర మహాసభలు గ్రేటర్ హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి. తుకారాం నాయక్ చెప్పారు. ముజఫర్ అహ్మద్ నగర్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహాసభలకు చెందిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తుకారాం నాయక్, మైదంశెట్టి రమేష్ మాట్లాడుతూ ఈ నెల 23న ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి అమరజీవి తాండ్ర కుమార్ స్థూపావిష్కరణ చేయనున్నట్లు తెలిపారు. అనంతరం మియాపూర్ మార్కెట్ ఆవరణలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, కేరళ రాష్ట్ర కార్యదర్శి శ్రీకుమార్, పొలిట్ బ్యూరో సభ్యులు కాటం నాగభూషణం, వల్లెపు ఉపేందర్ రెడ్డి, అరుణోదయ విమలక్క తదితరులు పాల్గొంటారన్నారు. పాలకులు దోపిడీ విధానాలను నిరసిస్తూ ప్రజా సంక్షేమ పాలన కోసం లాల్సేల్ ఐక్యత కోరుతూ ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలతో ప్రజల శ్రమను, సంపదను సంపన్నులు దోచుకుంటున్నారని విమర్శించారు.
సమస్యలు పరిష్కరించాలని ఉద్యమిస్తే తప్పుడు కేసులు పెట్టి నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మతోన్మాద విధానాలతో మరిన్ని కష్టాలకు గురి చేస్తున్నదని విమర్శించారు. ప్రజలకు సేవచేసే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం సైతం నిజాం పాలనను తలపిస్తున్నదని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు వామపక్షాలు, సామాజిక ఉద్యమాలను ఐక్యం చేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు కుంభం సుకన్య, పుష్ప, మురళి, దశరథ్ నాయక్, భాగ్యమ్మ తాండ్ర కళావతి, మధు సూదన్ తదితరులు పాల్గొన్నారు.