నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో ఇండెక్స్-సి వారు నిర్వహిస్తున్న గుర్జరి హస్తకళా హాత్ లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నృత్యమాల సంస్థ వ్యవస్థాపకురాలు సుధామాల, మాధవి మాల శిష్య బృందం సభ్యులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
గం గణపతే, స్వామినాత, శంకరి శ్రీగిరి, హనుమత సేవ, ప్రహ్లద శబ్దం, నమో నమో రఘుకుల, అన్నమాచార్య కీర్తన, అష్టపది, వందేహం, తరంగ మల్లికా తదితర అంశాలను స్వాతి, శ్వేత, భావిక, ప్రతిమ, మౌనిక, అభిజ్ఞ, నిహారిక, శృతి వారణాసి, యశస్వినీ, వెన్నెల తదితర కళాకారులు ఆహుతుల కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. తెలంగాణ సంగీత్ నాటక అకాడమీ సెక్రటరీ వసుంధర, ప్రముఖ నాట్య గురువులు డాక్టర్ రమాదేవి ముఖ్య అతిథులుగా హాజరై తిలకించారు. చక్కటి ప్రతిభ కనబరిచిన కళాకారులను ప్రోత్సహించి ప్రశంస పత్రాలు అందజేసి సత్కరించారు.