నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ లోని మాతృశ్రీ నగర్ కాలనీ కార్యవర్గాన్ని పూర్తిగా రద్దు చేసి తాత్కాలికంగా కమిటీ వేసేందుకు ఎన్నికలు నిర్వహించాలని మాతృశ్రీ నగర్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మాతృశ్రీ నగర్ కాలనీలోని సెప్టిక్ ట్యాంకు ప్రాంతాన్ని 1088 చదరపు గజాల స్థలాన్ని కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కావూరి అనిల్ కుమార్, మాతృశ్రీ కో ఆపరేటివ్ హోసింగ్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి గంటా శ్రీనివాసరావు తన బంధువులకు, కె.వెంకటేష్ అనే వ్యక్తికి కేవలము రూ. 48 లక్షలకు మాత్రమే విక్రయించి అన్యాయానికి పాల్పడటాన్ని కాలనీ వాసులు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ విలువ రూ.2.3కోట్లు కాగా, వాస్తవ మార్కెట్ విలువ 12కోట్లు పైగా ఉన్న సెప్టిక్ ట్యాంకు స్థలాన్ని విక్రయించడం, ఈ విషయం కాలనీ వాసులకు తెలియడంతో రిజిస్ట్రేషన్ ను రద్దు చేశారన్నారు. కాలనీ ఉమ్మడి ఆస్తిని రక్షించవలసిన అధ్యక్షుడే అవినీతికి పాల్పడడంతో కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడి రాజీనామాకు కార్యవర్గ సభ్యులు పట్టుబట్టారు. 15మంది కార్యవర్గంలో 11మంది సభ్యులు రాజీనామా చేయగా, మిగతా సభ్యులంతా రాజీనామా చేసి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు.
ఈ డిమాండ్లకు స్పందించకుండా ప్రధాన కార్యదర్శి నాగరాజు సమావేశం నుండి అర్ధాంతరంగా వెళ్లిపోయారని, బాధ్యతాయుతమైన వ్యక్తి అంత మంది సభ్యుల డిమాండ్ ను పట్టించుకోకుండా కార్యవర్గ సమావేశం నుంచి వెళ్లిపోవడం కాలనీవాసులు అందరినీ అవమానించడమే అన్నారు. వీరి అవినీతిని బయటకు తెచ్చిన వ్యక్తిపై మాజీ అధ్యక్షుడు కావూరి అనిల్ కుమార్ భౌతికదాడి చేసే ప్రయత్నం చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. అవినీతికి పాల్పడిన కావూరి అనిల్ కుమార్ సభ్యత్వాన్ని రద్దుచేసి వెల్ఫేర్ నుంచి తొలగించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిని కాలనీ వాసులు రెవెన్యూ, పోలీసు అధికారుల దృష్టికి ఈ నెల 30వ తేదీన తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిధులు దుర్వినియోగం కాకుండా, సదరు డాక్యుమెంట్స్ ట్యాంపర్ అవ్వకుండా సంబంధిత ప్రభుత్వ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని, కాలనీ అసోసియేషన్ లో ఏర్పడ్డ సంక్షోభాన్ని పరిష్కరించుటకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించాలని, కాలనీ సంక్షోభాన్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కె. రవీంద్ర రెడ్డి, సీహెచ్ రామయ్య, ఎం నారాయణ రావు, రంగా రావు, ఆంజనేయ రాజు, వెంకట రెడ్డి, అనిరుద్రారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.