నమస్తే శేరిలింగంపల్లి: నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకుని మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ లో శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని నలుదిశలా ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మహానుభావుడు అన్నారు. పేదవాడు బ్రతకడానికి కనీస అవసరాలైన తిండి, గూడు, బట్ట అని నమ్మి వాటిని కల్పించి వారి జీవితాలలో వెలుగు నింపారని చెప్పారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, ఆస్తి హక్కు కల్పించారని తెలిపారు. మహిళలకు రిజర్వేషన్, మహిళా సాధికారికతకు విశేష కృషి చేసిన మహాను బావుడు ఎన్టీఆర్ అని ప్రభుత్వ విప్ గాంధీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.