నమస్తే శేరిలింగంపల్లి: కలుషిత నీటి సరఫరాతో ప్రజలు ప్రతి నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు.
కలుషిత నీటి సరఫరాపై భారతీయ జనతా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ జలమండలి కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు ధర్నా చేశారు. అనంతరం జలమండలి కమిషనర్ కు కలుషిత నీటి సరఫరాతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ తగిన చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం మాదాపూర్ గుట్టల బేగంపేటలో, లంగర్ హౌజ్ గాంధీ నగర్ లో, రాంనగర్ లో కలుషిత నీరు సరఫరా అవుతోందన్నారు. గుట్టల బేగంపేటలో కలుషిత నీటిని తాగి ఇద్దరు మృతిచెందగా 200 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. లంగర్ హౌస్ లో 30 నుంచి 40 మంది, రామ్ నగర్ లో 30 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. బాధితులకు రూ. 25 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బిజెపి డిమాండ్ చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఎవరికి తెలియకుండా రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చాలా డివిజన్లలో నీటి సమస్య ఉందన్నారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.