నమస్తే శేరిలింగంపల్లి: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మహిళ దక్షత సమితి చేస్తున్న సేవలు మరవలేనివని, డిజిటల్ విద్య ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయ పరిజ్ఞానం పొందుతారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మియాపూర్ లోని సుమన్ కాలేజీలో మహిళ దక్షత సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని మహిళ దక్షత సమితి అధ్యక్షురాలు సరోజ్ బజాజ్ తో కలిసి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలకు విద్యా సాధికారత కావాలని, స్వతహాగా ఉద్యోగాలను సృష్టించుకోవడంతో పాటు తోటి వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. కేవలం విద్యలో సర్టిఫికేట్ పొందడం కాదని, విషయ పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఇంగ్లీష్ భాష అవసరమే కాని మాతృభాషను మరవరాదని, మాతృభాషలో ఉన్నత విద్యను అభ్యసించాలన్నారు. హర్యానా గవర్నర్ గా ఉంటూ 40 యూనివర్సిటీలను నడుపుతున్నానని చెప్పారు. మహిళా దక్షతతో తనకున్న తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఒక్క రోజైనా ఈ కళాశాలను సందర్శిస్తానని చెప్పారు. నర్సింగ్ కళాశాల సీట్లను పెంచేలా తానే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తానని అన్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ విధానాలను ప్రవేశపెట్టడంతో పాటు మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయాబెహతి, షీలా సోంవ్ తావియా, సుధాగోయల్, పుష్ప సాంగి, శారదా గుప్త, మున్నా జుగేటియా, ఉషా, కళాశాల ప్రిన్సిపాల్ సుశీల, ఉమా కుమారి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.