నమస్తే శేరిలింగంపల్లి: కలుషిత నీరు తాగి మృతి చెందిన కుటుంబంతో పాటు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల భేగంపేట్ వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి ఒకరు మృతి, 20 మందికిపైగా అస్వస్థత గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని విషయం తెలుసుకుని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బిజెపి నాయకులు గోవర్ధన్, రఘు, వెంకట్, బస్తీ వాసులతో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కలుషిత నీరు తాగడం వలనే బస్తీలో భీమయ్య అనే వ్యక్తి మృతి చెందడం బాధాకరమని అన్నారు. కలుషిత నీటిని తాగడం వలన రాత్రి నుండి వాంతులు, విరేచనాలతో దాదాపు 20 మందికి పైగా అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారన్నారు. కలుషిత నీటిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమనన్నారు. వాటర్ వర్క్స్ అధికారులకు సమస్యలను వివరించి బస్తీలో శాశ్వత పరిష్కారం చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి, హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య ఖర్చులు ప్రభుత్వంమే భరించాలన్నారు.