నమస్తే శేరిలింగంపల్లి: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైబరాబాద్ డీసీపీ, షీ టీమ్ ఇంచార్జీ సి. అనసూయ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో 150 మంది మహిళా వైద్యులకు వారి సేవలను గుర్తించి అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని నోవాటెల్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అనసూయ, మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక, రాజకీయ తదితర రంగాలలో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాకుండా వివక్షతకు తావులేకుండా చైతన్యవంతులై ఉండాలని చెప్పారు. మహిళల విజయానికి సంకేతంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ మహిళలకు అంకితం చేయబడిన రోజు అన్నారు. మహిళలు సమిష్టిగా ఉండి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మెడికవర్ హాస్పిటల్స్ చైర్మన్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ బ్రేక్ ది బియాస్ అనే థీమ్ తో ఈ సంవత్సరం మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దీని ముఖ్య ఉద్దేశం పురుషులతో పాటు మహిళలు సమానమేనని తెలిపారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మైళ్లు రాళ్లు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళా డాక్టర్లకు అవార్డులను ప్రధానం చేశారు. అనంతరం మహిళా వైద్యులకు శాలువాతో సత్కరించి మెమొంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.