సంత్ సేవాలాల్ జయంతిని సెలవురోజుగా ప్రకటించాలి – ఏఐబీఎస్ఎస్ జిల్లా కార్యదర్శి దశరత్ నాయక్

నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 వ తేదీన ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలని అఖిల భారత బంజారా సేవ సంఘ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఇస్లావత్ దశరత్ నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ సేవాలాల్ మహారాజ్ మేరమ్మయాడి దేవాలయం వద్ద బంజారా నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బంజారాలు 15 కోట్లు ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల జనాభాను కలిగి ఉన్నామని అన్నారు. సిక్కు మత ధర్మ గురువు గురునానక్ జయంతిని ఏ విధంగా అయితే సెలవుల జాబితాలో చేర్చారో అలాగే బంజారాల ఆరాధ్య దైవం బంజారాల ఆత్మగౌరవానికి ప్రతీక, విశ్వ బంజారాల ఆరాధ్యదైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 వ తేదీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సద్గురు సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మేరమ్మయాడి దేవాలయాలు జ్ఞాన మందిరం తెలంగాణ రాష్ట్రంలో నిర్మించాలని, బంజారా పూజారులకు దూప దీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేయాలని అన్నారు. లంబాడీ హక్కుల పోరాట సమితి హైదరాబాద్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఆంగోత్ హరినాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాల్ మహారాజ్ వేడుకలను అధికారికంగా జరపడం సంతోషకరమని అన్నారు. బంజారాహిల్స్ లోని కెబిఆర్ పార్క్ కు సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుపెట్టాలని, దామాషా ప్రకారం 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని, బంజారాల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 15 న నడిగడ్డ తాండలో నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి భోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుకారం నాయక్, తిరుపతి నాయక్, దేవా నాయక్, రత్న కుమార్, మోహన్ నాయక్, కృష్ణ నాయక్, మధు నాయక్, గోపి నాయక్, రోహన్ నాయక్, శ్రీనివాస్ నాయక్, స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏఐబీఎస్ఎస్ జిల్లా కార్యదర్శి దశరత్ నాయక్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here