నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలువరించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంలో మరో ఏసీపీ అధికారిని, ప్రతి డివిజన్ కు ఒక టీపీఎస్ అధికారిని నియమించడంతో పాటు క్షేత్ర స్థాయిలో చైన్ మెన్లను ఏర్పాటు చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ప్రియాంక అల కు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ చందానగర్ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు డివిజన్లకు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఒక్క టీపీఎస్, ఒక్క ఏసీపీ మాత్రమే ఉండడంతో సర్కిల్ పరిధిలోని ఆయా డివిజన్లలో జరుగుతున్న అక్రమ కట్టడాలకు అంతులేకుండా పోయాయని అన్నారు. ఉన్న ఒక్క టీపీఎస్ అధికారి పటాన్ చెరు మున్సిపాలిటీ లో ఇంచార్జీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని పేర్కొన్నారు. చందానగర్ సర్కిల్ లో ప్రభుత్వ భూములు, చెరువులు చాలా వరకు కబ్జాలు అవుతున్నాయని, మాదాపూర్ డివిజన్ లో అయ్యప్ప సొసైటీ, గోకుల్ ప్లాట్స్, మాతృశ్రీ నగర్, హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలో అక్రమ కట్టడాలు, మియాపూర్ డివిజన్ సర్వే నంబర్ 44 లో బీకే ఎన్క్లేవ్, రెడ్డి కాలనీ, నాగార్జున ఎన్క్లేవ్ ప్రభుత్వ భూములు, ప్రశాంత్ నగర్ సర్వే నంబర్ 100లో చెరువులు ఎన్నో అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు. చందానగర్ డివిజన్ లో చాలా వరకు అక్రమ కట్టడాలు జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారని అన్నారు. ఈ సర్కిల్ లో ఒకే ఒక ఏసీపీ అధికారి ఉండడం అతను సైతం ప్రతి రోజూ కోర్టు కేసులంటూ అక్రమ నిర్మాణాల వైపు చూడడం లేదన్నారు. వెంటనే జోనల్ కమిషనర్ స్పందించి మరో ఏసీపీ అధికారితో పాటు ఒక్కో డివిజన్ కు ఒక్కో టీపీఎస్ అధికారిని, ఒక్కో చైన్ మెన్ ను ఏర్పాటు చేసి నిత్యం ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి అక్రమ కట్టడాలను నిలిపి వేయించి వారికి అనుమతులు ఇచ్చేలా చూడాలని, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేలా కృషి చేయాలని మిద్దెల మల్లారెడ్డి జడ్సీకి విజ్ఞప్తి చేశారు.