నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటామని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ భరోసా ఇచ్చారు. బసవతారక నగరవాసులకు శుభవార్త తెలిపేందుకు మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, బిజెపి ముఖ్య నాయకులతో కలిసి బసవతారక నగర్ వాసులతో సమావేశమయ్యారు. మాజీ శాసనసభ్యులు బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ బసవతారక నగర్ వాసులకు న్యాయం జరిగేలా కోర్టులో స్టే రావడం శుభపరిణామమని అన్నారు. తాను శాసన సభ్యునిగా ఉన్నప్పుడు బసవతారక నగర్ వాసులకు కరెంట్ లైన్, గుడిసె లు వేయించడం, స్మశానం వాటికను ఏర్పాటు చేయించామన్నారు. నేటి ప్రభుత్వం పేదలను ఓట్ల కొరకే వాడుకొని రోడ్డు పాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు స్టే విధించి గుడిసెలు యదావిధిగా వేసుకోవాలని చెప్పడం సంతోషకరమని అన్నారు. ఈ పోరాటం ఇక్కడితో అగిపోలేదని, మున్ముందు బిజెపి నుంచి అన్ని సహయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని బిక్షపతి యాదవ్ చెప్పారు.
అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత ఇరవై రోజులుగా బసవతారక నగర్ వాసుల తరపున పోరాడుతూనే ఉన్నామన్నారు. ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ధర్మాసనాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. మొదటి పిటిషన్ కు సంబంధించి కోర్టు ఈ నెల 24 న స్టే ఆర్డర్ ఉత్తర్వులు ఇచ్చిందని, ఆర్డర్ కాపీ రావడంలో ఆలస్యం కావడంతో ఈ రోజు మీతో కలిసి ఈ అనందాన్ని పంచుకోవడం జరుగుతుందని అన్నారు. జనవరి 20న అధికారులు కౌంటర్ ఇవ్వాల్సి ఉందని ఆ తర్వాత తీర్పు బసవతారక నగర్ వాసులకే న్యాయం జరిగేలా వస్తుందని అన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పోరాటంలో కోర్టు స్టే తో కొంత విజయం సాధించామని, కోర్టు లో న్యాయం జరిగే వరకు పోరాడుదామని చెప్పారు. అనంతరం నిర్వాసితులకు కోర్టు స్టే ఆర్డర్ కాపీని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు , జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.