నమస్తే శేరిలింగంపల్లి: హిందువులకు పవిత్రమైన గ్రంథం భగవద్గీత అని, భగవద్గీత పుట్టినరోజున గీతా జయంతిని జరుపుకొంటారని సామాజిక సేవ రత్న బేరి రామచందర్ యాదవ్ అన్నారు. గీతా జయంతి సందర్భంగా గుల్ మొహర్ పార్క్ అధ్యక్షులు, రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు షేక్ ఖాసిమ్‌ను భేరి రాంచందర్ యాదవ్ సన్మానించి భగవద్గీత గ్రంథాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గీ’ కారం త్యాగ రూపం, ‘త’ కారం ఆత్మ స్వరూపాన్ని సూచిస్తుందని అన్నారు. హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున సాక్షాత్తు ఆ భగవానుని నోటా గీత శబ్దము ఉద్భవించినదని తెలిపారు. మానవజాతికి దివ్య మార్గాన్ని చూపించే పవిత్ర గ్రంథం భగవద్గీత అని అన్నారు. ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ పఠించాలని సూచించారు. భగవద్గీతలో మానవుడు ఆచరించవలసిన అంశాలు చాలా ఉన్నాయని, మానవ జీవితానికి అర్థం, కర్తవ్యం గురించి వివరించే గ్రంథమన్నారు. కర్మఫలాలను ఆశించకుండా కర్మలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ ఉపాధ్యక్షులు రాయుడు, పి. శివ, నాగేశ్వరరావు, చంద్రశేఖర్, బుచ్చయ్య యాదవ్, ఎమ్.డి. కమల్ పాషా, లఘు చిత్ర దర్శకుడు పెద్ద రాజుల మధు, నటులు తలారి పవన్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.