నమస్తే శేరిలింగంపల్లి: నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదానికి గురై ఒక యువ ఇంజనీర్ మృతి చెందిన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా దక్కిలి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన నాగోలు సుధీర్‌రెడ్డి (24) బ్రతుకు దెరువుకోసం నగరానికి వలస వచ్చి సివిల్ ఇంజనీర్‌గా విదులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి స్టేడియం ఎదురుగా ఉన్న ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ సంస్థలో ఒక భవనిర్మాణంలో విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సదరు నిర్మాణంలో ఉన్న భవనంలోని మొదటి అంతస్థులో సునిల్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సిబ్బంది పనిలో నిమగ్నం అయ్యారు. ట్రైపోల్‌తో స్లాబ్‌ను కట్ చేస్తున్న క్రమంలో బరువు ఎక్కువైన కారణంగా ట్రైపోల్ వంగిపోయి సునిల్ రెడ్డి తలకి తగిలింది. దీంతో తోటి సిబ్బంది అతడిని స్థానిక కాంటినెంటల్ దవఖానాకు తరలించగా కాగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు దృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.