చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): తల్లి ప్రక్కనే నిద్రిస్తున్న నాలుగు నెలల బాలుడు అర్ధరాత్రి వేళ కనిపించకుండా పోయాడు. బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో కేవలం రెండు గంటల వ్యవధిలోనే చిన్నారి ఆచూకీ కనిపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటక ప్రాంతానికి చెందిన భాను నాలుగేళ్ల క్రితం నగరానికి భార్య పిల్లలతో వలస వచ్చి వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా తారానగర్‌లో నూతనంగా నిర్మాణమవుతున్న ఇంటిలో పనికి చేరి అక్కడే నివాసం ఉండసాగాడు. కాగా సోమవారం అర్ధరాత్రి లేచిన భాను తమ నాలుగు నెలల కుమారుడు ప్రభాస్ కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు. భార్యను లేపి చుట్టుప్రక్కల వెదికినా ప్రయోజనం కలుగలేదు. ఓ గుర్తు తెలియని వ్యక్తి బాబును తీసుకుని వెళ్తున్నట్లు కొందరు తెలపడంతో భాను వెంటనే చందానగర్ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన ఎసిపి కృష్ణప్రసాద్, ఇన్‌స్పెక్టర్ కాస్ట్రోరెడ్డిలు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిసికెమెరాల సహాయంతో దర్యాప్తు జరిపిన పోలీసులు రెండు గంటల్లోనే బాలుడి ఆచూకీ కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. పరారీలో ఉన్న నిందితుని కోసం స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






