- సంక్లిష్టమైన గుండె శస్త్రచికిత్స చేసి బాలుడిని కాపాడిన వైద్యులు
నమస్తే శేరిలింగంపల్లి: పుట్టుకతోనే హృదయ సంబంధ సమస్యతో బాధపడుతున్న దక్షిణ సూడాన్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడికి శేరిలింగంపల్లిలోని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు సంక్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారు. ఆఫ్రికా దేశంలోని దక్షిణ సూడాన్ కు చెందిన ఐదేళ్ల బాలుడు విక్టర్ బియోర్ కు మూడు నెలల వయసులోనే గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నాడు. గుండెలో రంధ్రంతో పాటు గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దమనులు సంకోచించి రక్తనాళాలు సన్నబడ్డాయి. దీంతో ఊపిరితిత్తులకు రక్తసరఫరా తగ్గిపోయి ఆరోగ్యం క్షీణించసాగింది. దీంతో ఆసుపత్రి గురించి తెలుసుకున్న బాలుడి తల్లి మాగ్దలిన్ అయెన్ డెంగ్ పాన్యాం మూడు వారాల క్రితం కాంటినెంటల్‌లో చేర్చింది. వైద్యులు సంక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా కాంటినెంటల్ ఆస్పత్రి సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రాచకొండ మాట్లాడుతూ మూడు వారాల క్రితం బాలుడు ఆస్పత్రిలో చేరగానే పరిస్థితిని గమనించి వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చేశామని. సర్జరీ చేసిన అనంతరం మూడు వారాలుగా నిత్యం బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని తెలిపారు. బాలుడు పూర్తిగా కోలుకోగానే డిశ్చార్జి చేశామని తెలిపారు. కాంటినెంటల్ నేడు దేశంలోనే సమగ్ర వైద్యసేవలందించే ఆస్పత్రులలో ఒకటని, తమ ఆస్పత్రిలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న రోగులకైనా , ఎలాంటి సంక్లిష్టమైన సమస్యలతో బాధపడేవారికైనా చికిత్సలు అందిస్తున్నామన్నారు.