శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): హైకోర్టు న్యాయవాదుల జంటను నడి రోడ్డుపై కిరాతకంగా హత్య చేయడం చూస్తే తెలంగాణలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, భూమాఫియా రాష్ట్రంలో రాజ్యమేలుతుందని అర్థమవుతుందని బిజెపి రాష్ట్ర నేత, ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. బుధవారం జరిగిన సంఘటన రాష్ట్రంలో భయోత్పాతాన్ని సృష్టించిందని అన్నారు. ఈ హత్యలపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మంలో రామారావు, ఇప్పుడు ఈ జంట హత్యలు పరిస్థితిని భయానకంగా మార్చాయని, అధికార పార్టీ నాయకులు పోలీసుల సహకారంతో కేసుల పేరిట భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ప్రశ్నించే, పోరాడే గొంతులను శాశ్వతంగా మూయించి వేస్తున్నారని, అక్రమ కేసులతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలీసులను ప్రశ్నించేవారిపై ఉసిగొల్పుతున్నారని కసిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా విమర్శించారు. సామాజిక ఉద్యమకారులకు అత్యున్నత న్యాయస్థానాలు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.