- డబ్బులు పెట్టుబడి పెడితే 3 నెలల్లో 4 రెట్ల లాభం వస్తుందని ఎర
- 20వేలకు పైగా బాధితులు.. రూ.50 కోట్ల వరకు పెట్టుబడులు..
- గ్యాంగ్ కు సంబంధించిన ముగ్గురి అరెస్టు.. రూ.3 కోట్ల నగదు ఉన్న బ్యాంకుల సీజ్..
- ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): డబ్బులు పెట్టుబడి పెడితే 3 నెలల్లో 4 రెట్ల లాభం వస్తుందని చెప్పి ఓ గ్యాంగ్ వేల సంఖ్యలో ప్రజలను మోసం చేసింది. ఎట్టకేలకు ఆ గ్యాంగ్ చేస్తున్న మోసం బయట పడడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు విచారణ చేపట్టి ఆ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న మొత్తం 5 మందిలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారు నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశారు. సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సోమవారం ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన ఉదయ్ ప్రతాప్ (41), రాజేష్ శర్మ (36), ఢిల్లీలోని ద్వారకకు చెందిన నితేష్ కుమార్ కొఠారి (36)లతోపాటు చైనాకు చెందిన జాంగ్ హాంగ్‌వెయ్ అలియాస్ పీటర్, పెంగ్ గువొవెయ్‌లు ఢిల్లీ, కాన్పూర్, పూణె, బెంగళూరు కేంద్రాలుగా పలు ఫేక్ కంపెనీలను ఏర్పాటు చేశారు. అలాగే www.ciciseo.com, షేర్డ్ బీకే యాప్ పేరిట ఓ వెబ్‌సైట్, ఓ యాప్‌లను సృష్టించారు. వాటి ద్వారా అనేక మందిని ఆకర్షించారు. ప్రజలు వాటిలో ఎంత పెట్టుబడి పెట్టినా 3 నెలల్లో 4 రెట్ల లాభం వస్తుందని నమ్మబలికారు. ఇందుకు గాను వారు పలు స్కీంలను కూడా ఆఫర్ చేశారు.
మొదటి స్కీంలో భాగంగా కనీసం రూ.300 పెట్టుబడి పెట్టాలి. దీనికి రోజుకు రూ.15 చొప్పున 3 నెలలు.. అంటే 90 రోజుల్లో రూ.1350 ఇస్తారు. రెండో స్కీంలో రూ.3వేలను పెడితే రోజుకు రూ.150 చొప్పున 3 నెలల అనంతరం రూ.13,500 ఇస్తారు. మూడో స్కీంలో రూ.15వేలను పెట్టుబడి పెడితే రోజుకు రూ.750 చొప్పున 90 రోజుల తరువాత రూ.67,500 ఇస్తారు. అయితే ఈ స్కీంలో తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు లాభాలు బాగా వస్తాయని ఆశ చూపడంతో సహజంగానే చాలా మంది ఈ స్కీంల పట్ల ఆసక్తి కనబరిచారు. దీంతో దేశవ్యాప్తంగా దాదాపుగా 20వేల మందికి పైగా బాధితులు ఈ స్కీంలలో సుమారుగా రూ. 50 కోట్లకు పెట్టుబడులు పెట్టారు. వీరికి పైన తెలిపిన వెబ్‌సైట్, యాప్‌లలో ఎప్పటికప్పుడు తమ పెట్టుబడి వివరాలు, తమకు రాబోయే మొత్తం ఏరోజుకారోజు అప్‌డేటెడ్‌గా కనిపించేవి. దీంతో నిజమే అని నమ్మారు. మొదల్లో చెల్లింపులు కూడా జరగడంతో పెద్ద ఎత్తున ఇందులో పెట్టుబడులు పెట్టారు. చివరకు మోసం చేశారని తేలడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విధంగా ప్రజలను మోసం చేస్తున్న ఉదయ్ ప్రతాప్, నితేష్ కుమార్ కొఠారి, రాజేష్ శర్మలను అరెస్టు చేసి వారి నుంచి 4 ల్యాప్‌టాప్‌లు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి కంపెనీలు నిర్వహిస్తున్న రూ.3 కోట్ల నగదు నిల్వ ఉన్న 10 బ్యాంక్ ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. కాగా మొత్తం 5 మందిలో ప్రస్తుతం ముగ్గురు నిందితులను మాత్రమే అరెస్టు చేశామని, మిగిలిన ఇద్దరు చైనీయులు జాంగ్ హాంగ్‌వెయ్, పెంగ్ గువొవెయ్‌లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. డబ్బులను పెట్టుబడిగా పెడితే పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయని ఎవరైనా చెబితే నమ్మకూడదని, నూటికి నూరు శాతం అలాంటి వారు మోసమే చేస్తారని, అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలకు ఇలాంటి వ్యక్తులు తారసపడితే వెంటనే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని లేదా సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాట్సాప్ నంబర్ 9493625553 లేదా సైబరాబాద్ వాట్సాప్ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617444 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.