నమస్తే శేరిలింగంపల్లి: అయోధ్య భవ్య రామమందిర నిర్మాణ జనజాగరణ కార్యక్రమంలో భాగంగా బిజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ సికింద్రాబాద్ విభాగ్ శారీరక్ ప్రముఖ్ నారాయణ మూర్తి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్ లు బుదవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కలిశారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ ప్రణాళికను ఆయనకు వివరించిన నేతలు, భవ్య మందిర నిర్మాణానికి తోచిన విరాళం అందించాలని వారిని కోరారు. సానుకూలంగా స్పందించిన గాంధీ తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరం కుల, మత, రాజకీయ వర్గాలకు సంబంధం లేని అంశమని తెలిపారు. రామయ్య సేవ చేసుకునే అవకాశం లభించడం మన అదృష్టమని అన్నారు. ప్రతీ ఒక్కరూ రామ మందిర నిర్మాణంలో ఉడతా భక్తిగా తోడ్పాటునందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు సుప్రజా ప్రవీణ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ లు పాల్గొన్నారు.