కరోనా వైరస్‌కు గాను దేశవ్యాప్తంగా శనివారం నుంచి భారీ ఎత్తున కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు 2.24 లక్షల మందికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఇచ్చారు. పలు చోట్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను, ఇంకొన్ని చోట్ల కోవాగ్జిన్‌ను ఇస్తున్నారు. కాగా తొలి రోజు వ్యాక్సినేషన్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న ఓ వార్డు బాయ్ మృతి చెందాడు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లాలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో వార్డు బాయ్‌గా పనిచేస్తున్న 46 ఏళ్ల మహిపాల్ సింగ్ అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. తరువాత ఒక రోజు అనంతరం.. అంటే.. ఆదివారం ఛాతిలో తీవ్రంగా నొప్పి వచ్చింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో అతను చనిపోయాడు.
అయితే అతను వ్యాక్సిన్ తీసుకున్న రోజు రాత్రి నైట్ డ్యూటీ చేశాడని, అతను వ్యాక్సిన్ తీసుకున్నందునే చనిపోయాడా, లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా అనే వివరాలు తెలియాల్సి ఉందని హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు.