సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ఆపరేషన్ స్మైల్ 2021లో భాగంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సైబరాబాద్ పోలీసులు సైబరాబాద్‌లోని తొమ్మిది డివిజన్లలో ఆపరేషన్ స్మైల్- VII బృందాలను ఏర్పాటు చేసి బాలలను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో బాల కార్మికులు, యాచించేవారు, చిత్తు కాగితాలు ఏరుకునేవారు, తప్పిపోయిన వారు తదితర పిల్లలను కనిపెట్టడానికి ఆపరేషన్ స్మైల్- VII కార్యక్రమాన్ని గత నెల రోజులుగా నిర్వహిచారు. ఈ క్రమంలో మైలార్‌దేవపల్లిలోని సమద్ బ్యాంగిల్స్ సంస్థ నుండి 17 మంది బాల కార్మికులను పోలీసులు రక్షించారు.
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టేపల్లి రోషన్ కాలనీలో ఉన్న సమద్ బ్యాంగిల్స్ కంపెనీపై ఆపరేషన్ స్మైల్ టీం, చైల్డ్ లైన్ టీం అధికారులు దాడి చేసి ఆ కంపెనీలో బాల కార్మికులుగా పనిచేస్తున్న 17 మందిని రక్షించారు. వారందరినీ తాళంవేసిన గదిలో ఉంచి గాజుల తయారీ పనిచేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో వారికి తగినంత ఆహారం, దుస్తులను కూడా అందివ్వడం లేదని, దీనివల్ల వారి ఆరోగ్యం దెబ్బ తిందని పోలీసులు తెలిపారు. విచారణలో వారికి వేతనాలను కూడా సరిగ్గా చెల్లించడం లేదని, వారితో నిత్యం 12 గంటలకు పైగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని, పిల్లలందరూ బీహార్‌కు చెందిన వారని అధికారులు గుర్తించారు. కాగా ఆ కంపెనీ, నిర్వాహకులపై నం 29/2021 యు / ఎస్ 374 ఐపిసి, 79 జెజె యాక్ట్ & 14 బాల కార్మిక చట్టం ప్రకారం అధికారులు కేసు నమోదు చేశారు. అనంతరం పిల్లలను శిశు సంక్షేమ కమిటీ, రంగారెడ్డి జిల్లా ఎదుట హాజరుపరిచారు. ఆ తరువాత వారిని షెల్టర్ హోమ్‌కు పంపారు.
కాగా సదరు చిన్నారులను తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 12 గంటలకు పైగా ఎటువంటి విరామం లేకుండా పని చేయిస్తున్నారని, వారు వెంటిలేషన్ లేకుండా చిన్న గదులలో అపరిశుభ్ర స్థితిలో నివసిస్తున్నారని, వారికి ఎటువంటి సెలవులు ఇవ్వడం లేదని, పిల్లలు పోషకాహార లోపం, పెరుగుదల లేక, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, తాము మొదటి సారి చూసినప్పుడు పిల్లలు తల నుండి కాలి వరకు దుమ్ముతో కప్పబడి అత్యంత దయనీయ స్థితిలో ఉన్నారని, వారి వయస్సు 8 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు.
బాల కార్మికుల వివరాలను తెలియజేసేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక వాట్సాప్ నెం. 7901115474 ను ప్రారంభించారని తెలిపారు. 14 ఏళ్లలోపు పిల్లలను హోటళ్ళు, రెస్టారెంట్లు, దాబాలు, టీ స్టాల్స్, ఇంటి పని మొదలైన వాటిలో ఉపయోగించే వారిపై చర్యలు తీసుకుంటామని, వారిపై ముందు తెలిపిన నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, లేదా 100 డయల్ కు కాల్ చేయడం, లేదా “smileteamcyb@gmail.com” కు ఇ-మెయిల్ పంపినా నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
14 సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలను బాల కార్మికులుగా పనిచేయించుకోవడంపై నిషేధం ఉందని తెలిపారు. ఎవరైనా ఇలా చేస్తే నిందితులకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తారని అన్నారు.