- అమ్మానాన్నలను కోల్పోయిన చిన్నారులు… దిక్కు తోచని స్థితిలో ఇంటి పెద్ద
నమస్తే శేరిలింగంపల్లి: నిన్న మొన్నటిదాకా గోరు ముద్దలు పెడుతూ కథలు చెప్పిన నానమ్మ గొంతు మూగబోయింది. లోకం తెలియని పసిపిల్లలు నోరారా నాన్న అని పిలిచినా పలకలేనంత దూరానికి వెళ్లిపోయాడు తండ్రి. ఆకలేస్తే బొజ్జనిండా బువ్వ పెట్టి ప్రేమగా ముద్దాడే అమ్మ అనంత లోకాలకు వెళ్లిపోయింది. కుటుంబ బాధ్యతల నుండి విశ్రమించి భార్య, మనువలు, మనువరాండ్రలతో కలిసి శేష జీవితాన్ని హాయిగా గడపుదామని కలలు కన్నాడు ఓ ఇంటి పెద్ద. ఊహించని పరిణామాలతో చేతికందివచ్చిన తన ఇద్దరు కొడుకులు, ఓ కోడలుతో పాటు భార్యను కోల్పోయి కుమిలిపోతున్నాడు. చిన్నారుల నవ్వులతో కళకళలాడిన ఓ నిండు కుటుంబం కరోనా ధాటికి కకావికలమైంది. ఒకే కుటుంబంలో నెలరోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులను కరోనా మహమ్మారి బలితీసుకుంది. ప్రతిఒక్కరి హృదయాన్ని కలచివేస్తున్న రాములు కుటుంబపు కన్నీటి గాధ ఇది.
లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణాలు…
బిహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీ ప్లాట్ నెంబర్ 283లో నివాసం ఉండే జీ.రాములుకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు. బిహెచ్ఈఎల్ సంస్థలో పనిచేసి పదవీ విరమణ పొందిన రాములు ఉన్నంతలో తన నలుగురు పిల్లలను జీవితంలో స్థిరపడేలా చేశాడు. కరోనా రెండవ దశ ఉదృతి కొనసాగుతున్న మే మొదటి వారంలో రాములు పెద్ద కుమారుడు గణేష్‌కు పొడిదగ్గు రావడంతో గచ్చిబౌలి హిమగిరి హాస్పిటల్‌కు తరలించారు. రూ.1.5 లక్షలు చెల్లించి చికిత్స అందించారు. ఐతే గణేష్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి స్థానిక టిమ్స్‌కు దవాఖానాకు తరలించారు. కాగా ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయి మే 5వ తేదిన గణేష్ మృత్యువాత పడ్డాడు. రాములు కుటుంబం ఆ బాద నుంచి కోలుకోక ముందే ఇంట్లోని పెద్ద వారందరికి కరోనా సోకింది. చిన్నకుమారుడు శ్రీనివాస్ ఆక్సీజన్ లెవెల్స్ తగ్గడంతో అతికష్టం మీద మోతినగర్‌లోని సన్‌రిడ్జ్ హాస్పిటల్‌లో బెడ్ దొరికితే అక్కడ చేర్పించారు. ఆ తర్వాత రాములును, ఆ వెంటనే అతడి భార్య యాదమ్మలను భెల్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. వారం తర్వాత వాళ్ల చిన్న కోడలు భాగ్యలక్ష్మి పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో ఆమెను చందానగర్‌లోని శిరీష నర్సింగ్ హోమ్‌కు తరలించారు. అక్కడ దాదాపు రూ.2 లక్షల వరకు ఖర్చయ్యింది. కానీ పరిస్థితి విషమించడంతో ఆమెను సైతం గచ్చిబౌలి టిమ్స్ దవాఖానాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మే 21న భాగ్యలక్ష్మి తుదిశ్వాస విడిచింది. మరోవైపు శ్రీవివాస్ పరిస్థితి మరింత విషమించింది. అప్పిటికే దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చయ్యాయి. 15 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీనివాస్ సైతం మే 31న మృతిచెందాడు. పెద్ద కుమారుడు శ్రీనివాస్ మృతితోనే తీవ్ర మనస్థాపానికి లోనై, కరోనాతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రాములు అతని భార్య యాదమ్మలకు చిన్నకుమారుడు, కోడలు మృతి విషయాన్ని చెప్పలేదు. పది రోజులు చికిత్స అనంతరం కొద్దిగా కోలుకున్న రాములు ఇంటికి చేరుకున్నాడు. అతని భార్య యాదమ్మ ఆక్సీజన్ లెవెల్స్ పడిపోయి పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను నిజాంపెట్‌లోని ఎస్ఎల్‌జీ హాస్పిటల్‌కు తరలించారు. దాదాపు రూ.4 లక్షలు ఖర్చుపెట్టినప్పటికి యాదమ్మ కోలుకోలేక పోయింది. జూన్ 6వ తేదిన యాదమ్మ తనువు చాలించారు. సరిగ్గా నెల వ్యవధిలోనే రాములు కుటుంబంలో నలుగురు మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అన్నీ పోయి అప్పులు మిగిలాయి… అంధకారంలో పిల్లల భవిష్యత్తు
తన కళ్లముందే భార్య, ఇద్దరు కుమారులు, చిన్న కోడలు ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడుతుండటం చూసి తట్టుకోలేక అనారోగ్యం పాలయ్యాడు. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా కోలుకుంటున్న రాములు వృద్దాప్యంలో మనుమళ్లు, మనువరాళ్ల బంగారు భవిష్యత్తును చక్కబెట్టేదెలాగో తెలియక కుమిలిపోతున్నాడు. రాములు పెద్ద కుమారుడు గణేష్‌కు ఒక కుమారుడు భానువర్ధన్(ఇంటర్), కూతురు భావన(7వ తరగతి) సంతానం. చిన్నకుమారుడు శ్రీనివాస్, భాగ్యలక్ష్మి దంపతులకు ఒక కుమార్తె శ్రీనిధి(7వ తరగతి), కుమారుడు సాయిజతిన్(3వ తరగతి) సంతానం. 75 ఏళ్ల వయ్యస్సులో వారిని ఏ విధంగా పెంచి పోషించాలని కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఇప్పటికే కుటుంబ సభ్యుల వైద్యకోసం అక్కడా ఇక్కడా అప్పుచేసి రూ.20 లక్షలకు పైగా ఖర్చుచేసినా నలుగురుని కోల్పోయిన రాములు ఆర్ధికంగా మరింత చతికిల పడిపోయాడు.
కుటుంబంలో నలుగురిని కోల్పోయి దిక్కులేని వాడిగా మిగిలిపోయిన ఆ ఇంటిపెద్దకు తోచిన బరోసాను ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఆ చిన్నారుల భవిష్యత్తు కోసం మానవతా వాదులు ముందుకు వచ్చి నిండుమనసుతో ఆర్ధిక సహకారం అందించాలని నమస్తే శేరిలింగంపల్లి తరపున వేడుకుంటున్నాం. రాములు కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయదలచిన వారు క్రింది బ్యాంకు వివరాలకు గానీ, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా సహయాన్ని అందించవచ్చు. అకౌంట్ నెంబరు 3327101010813, ఐఎఫ్ఎస్‌సి కోడ్ CNRB0003327, కెనరా బ్యాంక్ చందానగర్ శాఖ. ఫోన్‌పే, గూగుల్ పే నెం. 9849094030 (ఖాతాదారు పేరు: కిష్టాపురం లక్ష్మి)